Tuesday, December 11, 2012

వల్లి (పిచ్చి, ప్రేమ, కథ)

టీవీ 19 న్యూస్ లో వస్తోంది. Live గా అవార్డ్ ల హాల్ ముందు నించి కవర్ చేస్తున్నారు.

టీవీ 19: జానపద కళా ప్రపూర్ణ, జానపద కథల సామ్రాట్, గోల్డెన్ హాండ్ "సాహితి వర్మ" గారు, ఇప్పుడే వస్తున్నారు. ఆయన కారు బంజారా హిల్స్ దాటిందని ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ శ్రీ అవార్డ్ కి, ఆయన ఎంపిక అవ్వడం ముదావహం. ఈ లోపులోనే ఆయన రాసిన కథకి, ఎనిమిది నంది అవార్డులు రావడం నిజంగా, గొప్ప విషయం. ఈ విషయం పైన మీ కామెంట్స్ ఏమిటి? (స్టూడియో కి కాలు transfer  చేస్తూ అంది ...)

స్టూడియో: నిజంగా, మన తెలుగు కథల్లో మనదనేది, తగ్గిపోతోంది, ఇప్పుడు పరిస్థితి ప్రకారం చూస్తె, అసలు తెలుగు కథలు తెలుగు లాగానే ఉండటం లేదు. అటువంటి సమయం లో, మళ్ళీ ఆ పాత "కత్తి కాంతారావు" ని తెర మీద ఆవిష్కరించడం అనేది, చాలా గొప్ప విషయం. దాంతో పాటుగా, మంచి viewership, మంచి అవార్డులు ఒకే సారి, ఆ..., కొట్టెయ్యడం అనేది, చాలా గొప్ప విషయం. నిజంగా వర్మ గారు, మన తెలుగు వాడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వ పడుతున్నాను.

-- 2 --

టీవీ 19: అలాగే ఇప్పుడు వర్మ గారు వచ్చేసారు. ఆయననే అడుగుదాం. (కారు దిగిన వర్మ తో ...)

టీవీ 19: వర్మ గారు, "what is your secret of success?"

వర్మ: నవ్వుతూ, మా అమ్మా నాన్నల ఆశీర్వాదం, తెలుగు ప్రజల ఆకాంక్ష, (ఈ మాట వింటూనే అక్కడ ఒక పెద్ద roar  వినిపించింది), నా నిరంతర ఆపేక్ష (ముగించాడు).

టీవీ 19: (ఇంక ముగిస్తూ) చూసారు కదండీ, ఇది మన తెలుగు ముద్దు బిడ్డ వర్మ గారి అంతరంగం. చూస్తూనే ఉండండి టీవీ 19, మీ ఫేవరెట్ న్యూస్ చానల్.

-- 3 --

అవార్డులు అయ్యాక, జనాల హర్ష ధ్వానాల మధ్య, కారు ఎక్కి కూర్చున్నాడు వర్మ. కారులో ఉన్నాడు మామ, తనకి వరసకి మామయ్య అవుతాడు. నేనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అని, అందరితోటి చెబుతాడు వర్మ. కానీ, అవకాశాల కోసమని హైదరాబాద్ వచ్చిన మామని ఒక ఘోస్ట్ రైటరు గా, ఉపయోగించుకుంటున్నాడని ఎవరికీ తెలియదు. ఇందాకా చెప్పిన "ఆ తెలుగు ప్రజల ఆకాంక్ష" డయలాగు కూడా మామ రాసిందే. ఎప్పుడు అదో నవ్వు నవ్వుతూ ఉంటాడు మామ,  టీవీ వాళ్లకి కూడా ఇదే చెప్తాడు వర్మ.

వర్మ: చంపేస్తున్నారు, చూసావు కదా. (చేతి వేళ్ళు దగ్గరగా పెట్టి, అక్షింతలు వేస్తున్నట్టు) అతి చిన్న వయసులోనే పద్మశ్రీ సంపాదించిన వర్మ గారు (నవ్వుతున్నాడు. ఒకింత గొప్పగా నవ్వుతున్నాడు. మామ కూడా అదో రకం గా నవ్వుతున్నాడు)

వర్మ సంపాదించిన ఆస్తి, ఒక 1000 కోట్లు ఉంటుందని తెలిసిన వాళ్ళు అంటారు, కాని నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. అతనికి చాలా మంది ఘోస్ట్ రైటర్స్ ఉన్నారని, అన్నారు కొందరు, కాని ఎవరికీ ఆధారాలు దొరక లేదు.
అతనికి అంత సీను లేదని అన్న వాళ్ళూ ఉన్నారు, వాళ్ళు చివరికి ఇండస్ట్రీ లో బేరాలు లేక ఇంటికి పోవాల్సి వచ్చింది. మొత్తానికి అతని సీక్రెట్ ఏమిటో ఎవరికీ తెలియదనే చెప్పాలి.

-- 4 --

కారు లో అందరూ నవ్వుతున్నారు. వర్మ అయితే చాలా నవ్వుతున్నాడు, మామ నవ్వు షరా మామూలే. ఇంతలో వర్మ ఫోను రింగు అవుతోంది. వర్మ ఫోను తీసాడు.

వర్మ: (నవ్వు గొంతు తోటి) హలో...!

అవతలి వైపు: నాకు నీ సీక్రెట్ తెలుసు.

అది వింటూనే వర్మ మొహంలో రంగులు మారాయి.

వర్మ: (మరొక్క సారి కన్ఫర్మ్ చేసుకుందామని) హలో, హలో!

అవతలి వైపు: నాకు నీ రహస్యం తెలుసు,

వర్మ: ఏమిటి నువ్వు మాట్లాడు తున్నది ఏమి అర్ధం కావటం లే... (పక్కనే ఉన్న మామ కేసి చూస్తూ, ఎవరికీ తెలియకూడదని లో- వాయిస్ లో ...)

వర్మ పూర్తి చేసే ముందే అవతలి వైపు నించి,

అవతలి వైపు: ఒక అమ్మాయి. ఒకే ఒక అమ్మాయి. ఒక అమ్మాయి, పేరు చెప్పనా! ఆ?

వర్మ: (ఈ సారి గట్టి గొంతు తోటి) వద్దు.

అవతలి వైపు: అలా రా దారికి. నేను చెప్పిన చోట, చెప్పినప్పుడు కాలు, అంటే, ఓకేనా!

వర్మ: ఓకే!

అవతలి వైపు: (ఎదో చెప్పాడు)... ఇప్పుడు ఫోన్ పెట్టేయ్, ఒకే!


వర్మ: ఓకే!


మామ ఎప్పటిలా నవ్వుతూనే ఉన్నాడు, వర్మ మొహం లోనే నవ్వు లేదు. ఎలాగో ఇంటికి చేరాడు వర్మ.

(సశేషం)

No comments:

Post a Comment