Tuesday, August 31, 2010

శ్రీ రామ రాజ్యం (1/5)


ఈ సినిమా నిజం చెప్పాలంటే అస్సలు బాలేదు. రామాయణం తెలిసిన కధే కాబట్టి, కధ చెప్పడంలో ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి. డైలాగుల్లో కాని, పాత్ర చిత్రణ (Characterisation) లో గాని, ఒకటికి రెండు కాదు పది సార్లు ఆలోచించాలి. కాని ఈ సినిమాలో ఎన్నో ఎన్నో లోపాలు ఉండటం గమనార్హం.

మొట్టమొదట రాముడు, సీతాదేవిని ఒక చాకలి మాటలు విని వదలవలసి వచ్చినప్పుడు, మధనపడినట్టుగా చూపించారు. రాముడు, సింహాసనాన్ని తన తమ్ములకి ఇద్దామనుకుంటాడు, తమ్ముళ్ళతో ఎవరైనా తీసుకోండి అని మొర పెట్టుకుంటాడు. ఆ సీను పండలేదన్న సంగతి పక్కన పెడితే (సింహాసనం వద్దనడానికి, తమ్ముళ్ళు చెప్పే కారణం అంత గొప్పగా ఏమి ఉండదు), రాముడు తాను రాజుగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కి ప్రతిచర్య ఆలోచించకుండా, escape అవ్వడానికి ప్రయత్నించిన మానసిక దౌర్బల్యం మనకి కనిపిస్తుంది.


రాముడూ మనిషే కావచ్చు, అతనికీ కొన్ని సందర్భాలలో బాధ కలగవచ్చు, ఐతే, రాముడు చేసే మంచి పనులన్నీ ఎవరికోసం చేసాడు? తన రాజ్య ప్రజల కోసమా, తన పూర్వీకుల కోసమా, తన కోసమా? నన్నడిగితే, రాముడి కాలంలో, అతను పెట్టుకున్న principles ఏమి అంతకి ముందు లేవు. ఏక పత్నీవ్రతం, సాక్షాత్తు తన తండ్రి గారికే లేదాయే. సత్య వాక్పరిపాలనం, పిత్రు వాక్పరిపాలనం, లాంటివి ఒక వ్రతం లాగ, జీవితాంతం ఎవరూ చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి మంచి లక్షణాలతో పాటు, తల్లీ కొడుకూ, తండ్రీ కొడుకు, భార్యా భర్త, స్వామీ బంటు, అన్న తమ్ముడు, పాలకుడు పాలితుడు లాంటి ఎన్నో మానవ సంబంధాలను (human relations) నిర్వచించాడు కాబట్టే, వాటన్నిటినీ balance చేసాడు కాబట్టే, రాముడు యుగ పురుషుడు అయ్యాడు. రాముడు నడిచిన బాట (రామాయణం) ఈ నాటికి చదవదగినది/ఆచరించదగినది గా ఉంది అంటే, దానికి కారణం ఈ రోజు కూడా అతను బాలన్సు చేసినట్టు human relations బాలన్సు చెయ్యవలసిన అవసరం అందరికీ ఉండటమే. దీనిని బట్టి, రాముడు అన్నీ చెయ్యడం లో ఆనందాన్ని పొందాడనేది నిర్వివాదాంశం.



ఒక వేళ రాముడు ఆనందాన్ని పొందినా పొందకపోయినా, అదే విధం గా ఆయనని చూపించడం ఒక్కటే, సామాన్య ప్రజానీకానికి శ్రేయస్కరం. అదే ఆయనలోని దైవత్వాన్ని మనుషులకి ఒక message లాగా చేరుస్తుంది. అయితే, ఈ సినిమాలో రాముడు చాలా బాధ పడినట్టు చూపించారు. తన తమ్ములలో ఎవరో ఒకరికి రాజ్యాన్ని ఇచ్చి, తను సీతా  అడవుల్లోకి వెళ్లిపోతామనేది, అతని కోరిక గా తోచింది. చివరికి తన వంశ ప్రతిష్ట కోసమని, పూర్వీకుల కోసమని అతను గుండె రాయి చేసుకుని సీతాదేవిని అడవికి పంపించాడట.

రాముడు ఆ తరువాత, కొంత కాలం తన కర్తవ్యమైన ప్రజా పాలనని విస్మరించాడట. నాకైతే అది సరిగ్గా అనిపించలేదు. రాముడు ఇంకో సీనులో "ప్రజలంతా నా బిడ్డలే" అంటాడు. ఒక వేళ, తెలిసి తెలియని బిడ్డ, తండ్రి వద్దకి వచ్చి, "నాన్నా! అమ్మ మంచిది కాదు, వదిలేయ్" అంటే, మంకుపట్టు పడితే, తండ్రి వదిలేస్తాడు, అనుకుందాం. ఎందుకంటే, వదలందే, పిల్లవాడికి మంచి బుద్ది, ఒక రకం గా "సెక్యూరిటీ" డవలప్ అవ్వవు, కాబట్టి "తాత్కాలికం గా వదిలేస్తాడు", అనుకుందాం.

అయితే మటుకు, తన పిల్ల వాడిని ప్రేమించే తండ్రి, చిరునవ్వు తో అతని ఆలనా పాలనా చూడాలి కాని, విస్మరిస్తే ఎలా?

అశ్వమేధ యాగం ఆ తరువాతి ఘట్టం. ఒక ముని (ఋష్య శృంగుడు) వచ్చి, రాజ్య ప్రజలకి కలిగిన అశాంతి తగ్గాలంటే, అశ్వమేధం చెయ్యడం మంచిది అంటాడు, రాముడు సరే అంటాడు. అసలు అశ్వమేధం అంటే, తన రాజ్య విస్తరణం కోసం చేసే యాగం. దానికి, ఉన్న రాజ్యం లోని ప్రజల మంచి చెడ్డలకి సంబంధం ఏమిటో చెప్పలేదు. ఒక వేళ, మన పురాణాల్లో దీని వివరణ ఉన్నా కూడా, మన సినిమావాళ్ళు జాగ్రత్త చెయ్యలేదని, ఇది చెప్పలేదని నా డౌటు. ఈ రోజుల్లో audience కి సాధారణం గా వచ్చే ఇలాంటి డౌటు ని అశ్రద్ధ చెయ్యడం తగదు. ఇది కొంత వరకు ఓకే, అనుకోవచ్చు కాని.

రాముడి పిల్లలైన లవ కుశలు, రామాయణ౦ గానం చేస్తూ, అయోధ్య రావడం, రాముడు సీతమ్మ ని వదిలేసాడని తెలుసుకుని బాధతో తిరిగి రావడం, వరకూ ఓకే. తన తల్లి మందలించడం తో, తమ హద్దులు మీరమని చెప్పిన వాళ్ళు, తిరిగి చివరిలో రాముడితో యుద్ధం ఎలా చేశారు?

వాళ్ళు కూడా రాముడి కొడుకులే కదా, వాళ్ళు ఇచ్చిన మాట తప్పుతారా, పైగా అంత సులభం గానా? ఒక వేళ చిన్న పిల్లలు అనుకుంటే, ఈ యుద్ధం యొక్క purpose ఏమిటి, ఊరికే పిల్లలు రాముడితో ఫైటింగు చెయ్యడమా? పైగా అస్త్ర, శస్త్రాలు నేర్పిన వాల్మికి, ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వాలో, ఎప్పుడు కూడదో చెప్పలేదా?

ఇంకో విషయం, యుద్ధం ముందుగా రాముల వారిని చూసి, లవకుశలు, "ఏమి తేజస్సు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం", అని చెప్పి నమస్కార బాణం వేస్తారు. ఇది కూడా నాకు నచ్చలేదు. ముఖ తేజస్సనేది, మనిషి భౌతిక (physical) లక్షణం. ఇది ఎలా ఉందంటే, ప్రత్యర్ధి ఎర్రగా బుర్రగా ఉంటె, యుద్ధం చేసేవాడు నమస్కారం పెట్టాలన్నట్టు ఉంది. ఇలా కాక, రాముడి పరిపాలననో, సత్య సంధతనో తెలిసిన వారై, నమస్కారం చేసారంటే ఒక రకం గా ఉంటుంది. ఇదేదో, ఒక నమస్కార బాణం, ఒక తిరస్కార బాణం కోసమని అతికించినట్టు ఉంది. అసలు మనిషిలో నచ్చవలసిన మంచి గుణాల గురించి వాల్మీకి వాళ్లకి ఏమైనా చెప్పాడా లేదా, అనిపిస్తుంది.


ఇది కాక, "నిండు చూలాలు, గర్భిణి" లాంటి పెద్ద మాటలు, పది/పదమూడు సంవత్సరాల పిల్లలు వాడతారా? అప్పటికి వాళ్లకి వాటి మీనింగు తెలుస్తుందా? ఆ పరిస్థితి లో ఉన్న డెప్తు తెలుస్తుందా అంట? పోనీ తెలుస్తుందనే అనుకుందాం. ఇంకో సీనులో సీతాదేవి "నా బతుక్కి సుఖం లేదు" అంటుంది, అసలు ఎవరా డైలాగు రాసింది? తప్పు  కదా!? ఇంకో చోట, రావణుడి భార్య మండోదరి, రావణుడిని "స్త్రీ లోలుడు" అంటుంది. రావణుడు, రావణ బ్రహ్మ, మహా శివ భక్తుడు. అసలు "ఎంత గొప్ప వారైనా ఒక్క తప్పు తో పతనమౌతారు" అని చెప్పడానికి వాల్మీకి రావణుడిని చూపిస్తే, అతడిని "స్త్రీ లోలుడు" అని ఎలా అంటారు? స్త్రీ వ్యామోహం వేరు, స్త్రీ లోలత్వం (అదే పనిగా ఉండటం) వేరు.

లక్ష్మణుడు ఒకడు, సీతాదేవిని కాళ్ళకి మించి పైకి చూడడు, నాకైతే వదినని తల్లిగా చూసేవాడు, ఆమె మొహం చూసి మాట్లాడితే తప్పేమీ కనిపించలేదు? ఇది కొంత ఓకే. మొదటి పాటలో, "శుభ స్వాగతం" అని ఉంది, అసలు స్వాగతానికి శుభం/అశుభం ఉంటాయా? అలాంటి సమాసం సంస్కృతం లో లేదే, "ఘన స్వాగతం" గాని, "సాదర స్వాగతం" గాని ఉంటాయి గాని, ఈ శుభ స్వాగతం ఏమిటి?

ఇలాంటివే, ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో సినిమా నిండా. అందుకే నేను మిగిలిన పాటలు సాహిత్యం అని గాని, ఇంకోటని గాని గమనించలేదు. మంచి కధ, already వాల్మీకి మనకోసమని రాసి పెట్టినది. అందులో, డైలాగులకే తప్పు చేస్తే ఎలాగ? Characterisation తప్పు చెయ్యడం, అందులోను ఇలాంటి స్టోరీస్ లోఅనేది, నాకైతే నచ్చలేదు. మొత్తం మీద ఇలాంటి కధని సినిమాగా తీసేటప్పుడు బాగా జాగ్రత్త వహించాలి మరి.

బాపు గారి సినిమాలలో అందమైన సంభాషణలు ఉండేవి, దీనిలో లేవు మరి. అది రమణ గారు లేని లోటో ఏమో మరి, తెలియదు. మిగతా అందమైన graphics వర్కూ, అందమైన సంగీతం (ఇళయరాజా) ఉన్నాయి, మన హిందూ మతానికి సంబంధించిన ఒక కధ కాబట్టి, తెరకెక్కించడం మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. అయితే, ఒక కళాత్మక వస్తువ గా భావిస్తే మటుకు, దీనికి గారంటీ గా తక్కువ మార్కులే, తప్పదు.